
ప్రగతి నివేదన సభ గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రాన్ని, ప్రజలనూ ఏనాడూ పట్టించుకొని కాంగ్రెస్ నేతలు మేము నిర్వహించినా ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి భయంతో వణికిపోతున్నారు. వాళ్ళ సభలకు అనుమతి ఈయకుండా అడ్డుపడుతున్నామని ఆరోపిస్తున్నారు. వారి సభలకు మేమెప్పుడు అడ్డుపడ్డాము? ఇప్పటికైనా వారికి దమ్ముంటే సభ నిర్వహించుకోమనండి ఎవరు వద్దన్నారు.
ఇక ముందస్తు ఎన్నికలకు వెళదామంటే అధికారంలో ఉన్న మేము వెనకాడాలి కానీ కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు? నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్గారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడలేదు....దళితులకు 3 ఎకరాల భూమి హామీ గురించి మాట్లాడలేదు...అంటూ కాంగ్రెస్ నేతలు అర్ధం పర్ధంలేని విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 450కి పైగా పధకాలు ప్రారంభించింది. వాటన్నిటి గురించి సభలో వివరించడం సాధ్యమేనా? వాటి గురించి చెప్పాలంటే 24 గంటల సమయం కూడా సరిపోదని సిఎం కెసిఆర్గారు నిన్ననే చెప్పారు కదా? కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు?
రాష్ట్రంలో 14,000 ఎకరాల భూమిని దళితులకు పంచి ఇచ్చాము. కాంగ్రెస్ నేతలు కావాలంటే జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి ఆ వివరాలు తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ కలలో కూడా ఊహించలేనన్ని పధకాలు, పనులు మేము చేసి చూపిస్తుంటే వాళ్ళు అవి చూసి పిచ్చి పట్టినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, “ అని అన్నారు.