
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తూ రైతులు, విద్యార్ధులు, మేధావులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజాసమస్యల గురించి వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం ఆయన కడప జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు, మీడియా ప్రతినిధులు ఆయన భవిష్య కార్యాచరణ గురించి ప్రశ్నించగా “రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో పర్యటించాను. ఆ మూడు జిల్లాలలో కూడా పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకొన్న తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక సమర్పించి పరిష్కరించమని కోరుతాను. ఒకవేళ ప్రభుత్వం ఆ నివేదికపై స్పందించకపోతే అప్పుడు రాజకీయాలలోకి రావాలా వద్దా అని ఆలోచించి నిర్ణయం తీసుకొంటాను. అయితే రాజకీయాలలోకి రావడం వలన ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం కలిగితే రాజకీయాలలోకి రావడానికి ఏమాత్రం వెనుకాడను,” అని సమాధానం చెప్పారు.
ప్రజా సమస్యలన్నిటినీ ప్రభుత్వమే పరిష్కారించగలిగితే ఎప్పుడో పరిష్కరించి ఉండేది. కనుక ఆయన నివేదిక సమర్పించగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందనుకోవడం అత్యాసే అవుతుంది. కనుక లక్ష్మి నారాయణ రాజకీయాలలోకి రావడం ఖాయమేనని భావించవచ్చు. అయితే ఆయన కొత్త పార్టీ పెడతారా లేక భావసారూప్యత కలిగిన జనసేన వంటి పార్టీలో చేరుతారా? అనే విషయం తెలియాలి.