
టిఆర్ఎస్ సర్కారు కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్న సమయంలోనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు యూనివర్సిటీలో మెయిన్ లైబ్రెరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తరువాత ‘నిరుద్యోగ ఆవేదన సభ’ నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు హటాత్తుగా వచ్చి వారి సభకు హాజరయ్యారు. మొదట పోలీసులు ఆయనను అడ్డుకొన్నప్పటికీ, కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతానని హామీ ఇవ్వడంతో లోపలకు అనుమతించారు.
ఆ సభలో విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్న వారి కుటుంబాలను టిఆర్ఎస్ సర్కారు ఎలాగూ పట్టించుకోవడం లేదు. కనీసం నిరుద్యోగ యువతనైనా పట్టించుకొందా అంటే అదీ లేదు. పైగా తెలంగాణా కోసం పోరాడి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న ఓయూ విద్యార్ధులపై సిఎం కెసిఆర్ అకారణంగా కక్షపెంచుకొన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కెసిఆర్ ఆ తరువాత ఆ హామీని విస్మరించి నిరుద్యోగ యువతను మోసం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి వంటి హామీలను అమలుచేయలేదు. కొంగరకలాన్ లో సభ పెట్టడం కాదు ఆయనకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించాలని సవాలు చేస్తున్నాను,” అని వి.హనుమంత రావు అన్నారు.