రేపే తెలంగాణా శాసనసభ రద్దు?

టిఆర్ఎస్‌ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా రేపు సాయంత్రం కొంగర కలాన్ లో నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు చేయడంలో టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు, అధికారులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇటువంటి సమయంలో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గసమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించడంతో రాజకీయ వర్గాలలో ఊహాగానాలు మొదలైపోయాయి. 

రేపటి ప్రగతి నివేదన సభలో టిఆర్ఎస్‌ సర్కారు నాలుగేళ్ల పాలన గురించి చెప్పదలచుకొన్న విషయాలు, అలాగే ముందస్తు ఎన్నికల నేపద్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రకటించదలచుకొన్న వరాలపై సిఎం కెసిఆర్‌కు పూర్తి స్పష్టత ఉందని వేరే చెప్పనవసరం లేదు. మరి సభకు కొన్ని గంటల ముందు అంత హడావుడిగా మంత్రివర్గసమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలనుకొంటున్నారు? అంటే ఆ సమావేశంలో శాసనసభను రద్దు చేయడానికేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేకుంటే ప్రగతి నివేదన సభ నిర్వహించిన తరువాత తాపీగా మంత్రివర్గసమావేశం నిర్వహించుకోవచ్చు కదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ ఊహాగానాలు నిజమైతే, రేపు సమావేశం ముగియగానే సిఎం కెసిఆర్‌ అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్ళి గవర్నర్ నరసింహన్‌ను కలిసి శాసనసభ రద్దు చేసినట్లు తెలియజేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ప్రగతి నివేదన సభలో అదే విషయం ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహాగానాలు నిజమో కాదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.