అవును వారు ప్రధాని హత్యకు కుట్రపన్నారు

విరసం నేత వరవరరావుతో సహా హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు మంగళవారంనాడు అరెస్ట్ చేసి పూణేకు తరలించినప్పుడు, మహారాష్ట్ర పోలీసులపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. వాటిపై మహారాష్ట్ర అధనపు డీజి పరంబీర్ సింగ్ స్పందిస్తూ, “మేము అరెస్ట్ చేసిన వ్యక్తులు అందరూ ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి, దేశంలో విద్వంసం సృష్టించడానికి కుట్ర పన్నుతున్నట్లు నిరూపించే బలమైన ఆధారాలు మావద్ద ఉన్నాయి.

కోరేగావ్-భీమా అల్లర్ల కేసులో మేము దర్యాప్తు జరుపుతునప్పుడు మావో నేత కామ్రేడ్‌ ప్రకాశ్‌కు రోనా విల్సన్‌ వ్రాసిన లేఖతో సహా కొన్ని వేల లేఖలు లభించాయి. వారు రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి పధకం రచిస్తున్నట్లు ఆ లేఖలలో స్పష్టంగా ఉంది. అర్బన్ ఏరియాలలో పోరాటాలు కొనసాగించేందుకు రైఫిల్స్, గ్రెనేడ్స్, మందుగుండు సామాగ్రి వగైరాలు కొనుగోలు చేయడానికి రూ.8 కోట్లు సమకూర్చుకోవలసిన అవసరం ఉందని మావోయిస్టు రోనా విల్సన్ వ్రాసిన లేఖలో ఉంది. మేము మొన్న అరెస్ట్ చేసినవారందరికీ ఈ కుట్రతో బలమైన సంబంధాలు ఉన్నాయని నిరూపించే ఆధారాలు మావద్ద ఉన్నాయి. న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు వాటన్నిటినీ సమర్పిస్తాము,” అని అన్నారు.