
బిజిపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం మంత్రాలయం వెళుతూ మద్యలో హైదరాబాద్ విమానాశ్రయంలో కొంతసేపు ఆగి రాష్ట్ర బిజిపి నేతలతో సమావేశమయ్యారు. వారితో ముందస్తు ఎన్నికల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలు రావడం తధ్యమని కానీ అవి ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమీషన్ నిర్ణయిస్తుందని అన్నారు. ఆలోగా ఎన్నికలను ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
ముందస్తు ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుచుకొంటుందనే సిఎం కేసీఆర్ వాదనను ఆయన తేలికగా కొట్టిపడేశారు. ఈసారి ఎన్నికలలో టీఆర్ఎస్కు బొటాబోటి సీట్లు వస్తాయని కనుక ఇతర పార్టీల మద్దతు అవసరం పడుతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. కనుక వీలైతే రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి లేదా ‘కింగ్ మేకర్’ గా నిలిచేందుకు ఎన్నికల వ్యూహాలు రచించుకొని ముందుకు సాగాలని సూచించారు.
రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం సహకరించడాన్ని టీఆర్ఎస్-బిజిపి స్నేహంగా చూడరాదని, ఆ పార్టీతో బిజిపి పొత్తులు పెట్టుకోబోవడం లేదని కనుక టీఆర్ఎస్ను రాజకీయ శత్రువుగానే భావించి ఎదుర్కోవాలని అమిత్ షా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యం, ప్రభుత్వ అవినీతి తదితర అంశాలను ఆయుధాలుగా చేసుకొని టీఆర్ఎస్తో పోరాడాలని సూచించారు.
టీఆర్ఎస్లో అసంతృప్తులను బిజిపిలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేయాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం. త్వరలోనే తాను హైదరాబాద్ పర్యటనకు వచ్చి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తానని అమిత్ షా చెప్పారు.