ప్రగతి నివేదనకు హైకోర్టు లైన్ క్లియర్

టీఆర్ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనును ఈరోజు హైకోర్టు కొట్టివేసింది. ఆ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది వాహనాలలో లక్షలాది ప్రజలు తరలివస్తారు గనుక కొంగర కలాన్ పరిసర ప్రాంతాలలో పర్యావరణం పాడవుతుందని కనుక  ఆ సభకు అనుమతి ఇవ్వవద్దని పి శ్రీధర్ అనే న్యాయవాది హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. దానిపై ఈరోజు విచారణ చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం  తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ ప్రగతి నివేదన సభకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, పర్యావరణానికి ఎటువంటి నష్టం కలుగకుండా సభను నిర్వహించుకొంటామని చెప్పడంతో సభ నిర్వహణకు హైకోర్టు అనుమతించింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా సభను నిర్వహించుకోవాలని సూచిస్తూ శ్రీధర్ వేసిన పిటిషనును కొట్టివేసింది.