
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో దాని కొరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు త్వరలోనే అమలులోకి వస్తాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పరిపాలనాసౌలభ్యం కొరకు పాత 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఉద్యోగాల భర్తీ, పధోన్నతులు, బదిలీల విషయంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతుండటంతో తెలంగాణ రాష్ట్రానికి సరిపడే విధంగా కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వ అధికారులు అనేక కొర్రీలు వేస్తుండటంతో సిఎం కేసీఆర్ ఇటీవల స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగును కలిసి దీనిపై వారికి వివరణ ఇచ్చి ఒప్పించడంతో జోనల్ వ్యవస్థకు ఈరోజు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది.
రాష్ట్రంలో కొత్తగా అమలులోకి రానున్న జోన్స్ వాటి పరిధి వివరాలు:
కాళేశ్వరం జోన్: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు (జనాభా: 28.29 లక్షలు)
బాసర జోన్: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు (జనాభా: 39.74 లక్షలు)
రాజన్న జోన్: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు (జనాభా: 43.09 లక్షలు)
భద్రాద్రి జోన్: వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ( జనాభా: 50.44 లక్షలు)
యాదాద్రి జోన్: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు. (జనాభా: 45.23 లక్షలు) చార్మినార్ జోన్ : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు. (జనాభా: 1.03 కోట్లు)
జోగుళాంబ జోన్ : మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు. (జనాభా: 44.63 లక్షలు)
మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాలు:
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ.