వరవరరావుకు గృహనిర్బంధం

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేయబడిన విరసం నేత వరవరరావుతో సహా మరో ఐదుగురు ప్రజాసంఘాల నేతలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరినీ సెప్టెంబర్ 6వ తేదీ వరకు గృహ నిర్బందంలో ఉంచబోతున్నారు. కనుక ఈరోజు ఉదయం వారిని వారి నివాసాలలోకి దిగబెట్టిన తరువాత ఒక్కొక్కరి నివాసం ముందు మహారాష్ట్రకు చెందిన నలుగురు పోలీసులు, తెలంగాణ పోలీసులు కాపలా కాస్తున్నారు. 

మహారాష్ట్ర పోలీసులు మొన్న మంగళవారం అకస్మాత్తుగా హైదరాబాద్‌ వచ్చి వారి ఇళ్ళలో సోదాలు నిర్వహించిన తరువాత, వారిని అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టు అనుమతితో పూణేకు తీసుకుపోయారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయగానే హైదరాబాద్‌లోని పౌరహక్కుల సంఘాల నేతలు సుప్రీంకోర్టులో పిటిషను వేశారు. వరవరరావు తదితరులు ఎటువంటి కుట్రలు చేయలేదని వారిపై కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా కేసులు నమోదు చేసిందని కనుక వారిని తక్షణం విడుదల చేయాలంటూ పిటిషను ద్వారా సుప్రీంకోర్టును కోరారు. ఆ పిటిషనును విచారించిన సుప్రీంకోర్టు ‘ప్రజాస్వామ్యంలో అసమ్మతి ఒక సేఫ్టీ వాల్వ్ వంటిదని’ అనడం విశేషం. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేస్తూ అంతవరకు వారందరినీ గృహ నిర్బందంలో ఉంచాలని ఆదేశించింది. పౌరహక్కుల సంఘాలు వారి అరెస్టులను ఖండిస్తూ నిన్న నగరంలో అంధోళనా కార్యక్రమాలు నిర్వహించాయి.