
రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు బుదవారం మెదక్ జిల్లాలో రామాయంపల్లి వద్ద రూ.98 కోట్లు వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్ధిపేట, సిరిసిల్ల, కరీంనగర్ మూడు జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుంది. అందుకే కేసీఆర్ 2006లో కేంద్ర కార్మికమంత్రిగా ఉన్నప్పుడే ఈ రైల్వే లైన్ మంజూరు చేయించారు. కానీ సమైక్య రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గీతారెడ్డి రైల్వేలైన్ పనులు ప్రారంభించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయకపోవడం వలన గత 8 ఏళ్ళుగా పనులు మొదలవలేదు. అప్పుడు రూ.600 కోట్లు పూర్తయ్యే ఈ ప్రాజెక్టును వెంటనే చేపట్టకపోవడం వలన ఇప్పుడు రూ.1,160 ఖర్చు చేయవలసి వస్తోంది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఇప్పుడు ఈ రైల్వేలైన్ ఏర్పడబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా మొదటి దశ నిర్మాణపనులు పూర్తి చేసి వచ్చే జనవరి నుంచి మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ లో రైళ్లను నడిపిస్తాము. త్వరలో సంగారెడ్డి, నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్ ప్రాంతాలకు ఆరు లైన్స్ ఉండే అవుటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. దీని కోసం సిఎం కేసీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో మాట్లాడి రూ. 12,000 కోట్లు మంజూరు చేయించారు, అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే తూఫ్రాన్, సిద్ధిపేట జిల్లా కేంద్రం, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్, వేములవాడ పుణ్యక్షేత్రానికి రైలు ద్వారా చేరుకోవచ్చు.