
ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు తెలుగు సినీ పరిశ్రమ, గవర్నర్ నరసింహన్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మోహిదీపట్నంలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. తెలుగు సినీ, రాజకీయ రంగాలకు విశేష సేవలందించిన హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు మోదీదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర మొదలవుతుంది. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు. అందుకొరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.