నందమూరి హరికృష్ణ మృతి

ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణ (61) మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను నార్కట్ పల్లిలో కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ తలకు తీవ్ర గాయం అవడం చేత వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.  

ప్రాధమిక సమాచారం ప్రకారం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎదురుగా మరొక వాహనం కూడా ఉండటంతో రెండు వాహనాలు బలంగా డ్డీకొనడం వలన ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాధమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తొమ్మిదేళ్ల క్రితం అంటే 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారులో హైదరాబాద్‌ తిరిగివస్తున్న ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో  జూనియర్ ఎన్టీఆర్ కూడా తీవ్రంగా గాయపడినప్పటికీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తరువాత   హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీ రామ్ కూడా నల్గొండ జిల్లాలో మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద 2014, డిసెంబర్ 6వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.