డిఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఎన్నిక

తమిళనాడు రాజకీయాలలో మరో నూతన అధ్యాయం మొదలైంది. స్వర్గీయ కరుణానిధి రెండవ కుమారుడు స్టాలిన్‌ను ఈరోజు డిఎంకె పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు ఉదయం చెన్నైలోని తేనాంపేటలోని డిఎంకె పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కార్యదర్శులు మద్దతు పలకడంతో స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పార్టీలో వేరెవరూ నామినేషన్ వేయనందున స్టాలిన్‌ ఎన్నిక నిన్ననే ఖరారు అయ్యింది కానీ నేడు లాంఛనంగా ప్రకటించారు. 

అన్నాడిఎంకె పార్టీని 1949లో అన్నాదురై స్థాపించారు. ఆయన తదనంతరం 1969లో కరుణానిధి పార్టీ ప్రధానకార్యదర్శి బాధ్యతలు స్వీకరించి పార్టీలో అధ్యక్ష పదవిని సృష్టించి దానిని ఆయనే చేపట్టారు. అప్పటి నుంచి గత నెల 8వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు డిఎంకె అధ్యక్షుడిగానే కొనసాగారు. ఆయన తదనంతరం ఆయన రెండవ కుమారుడు స్టాలిన్‌ పార్టీ అధ్యక్షుడిగా నేడు ఎంపికయ్యారు. 

అయితే స్టాలిన్‌ ఎన్నికను ఆయన అన్నగారైన అళగిరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం కరుణానిధి స్వయంగా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ కరుణానిధి మరణించిన తరువాత తనను పార్టీలోకి తీసుకొని అధ్యక్ష పదవి ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అళగిరి హెచ్చరిస్తున్నారు. కానీ పార్టీ నేతలు ఆయన హెచ్చరికలను పట్టించుకోలేదు. స్టాలిన్‌కే డిఎంకె పార్టీ పగ్గాలు అప్పగించారు.