
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు హైదరాబాద్ నివాసంలో మహారాష్ట్ర పోలీసులు మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనికీలు చేయడం కలకలం రేకిత్తిస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఒక జర్నలిస్టు, వరవరరావుతో సహా మరో ఐదుగురి ఇళ్ళలో కూడా మహారాష్ట్ర పోలీసులు ఇవాళ ఆకస్మిక సోదాలు నిర్వహించారు. వారందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్నారని మహారాష్ట్ర పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిపై మహారాష్ట్ర పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్లు తాజా సమాచారం. ఈ సంగతి తెలుసుకొన్న ప్రజాసంఘాల నేతలు భారీ సంఖ్యలో వరవరరావు ఇంటికి చేరుకొని మహారాష్ట్ర పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వరవరరావు మావోయిస్టుల సానుభూతిపరుడనే సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రధాని మోడీనే హత్య చేయడానికి సాహసిస్తారంటే నమ్మశక్యంగా లేదు. పోలీసు విచారణ తరువాత ఆయన నిజంగా ఈ కుట్రలో పాలు పంచుకొన్నారా లేదా అనే విషయం తెలియవచ్చు. ఏమైనప్పటికీ వరవరరావుపై ఇంత తీవ్రమైన ఆరోపణ రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఆయనపై మహారాష్ట్ర పోలీసులు చేసిన ఆరోపణ నిజమని రుజువైతే ఆయన చాలా తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసివస్తుంది.