నేడో రేపో మంత్రివర్గ సమావేశం?

తెలంగాణా రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరపాలనే సిఎం కెసిఆర్‌ ప్రతిపాదనకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపినట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపద్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆధర్ సిన్హా రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హడావుడిగా ఏర్పాట్లు చేస్తుండటంతో ఆ ఊహాగానాలు నిజమేనని దృవీకరిస్తునట్లుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన ముఖ్యమైన అంశాలపై శాఖల వారీగా తక్షణమే నివేదికలు పంపించవలసిందిగా ఆయన అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు లేఖలు వ్రాశారు. వాటిలో పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ హామీలు, రాష్ట్రంలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలైన వివరాలను పంపించవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. 

సిఎం కెసిఆర్‌ తన డిల్లీ పర్యటన ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకొన్నారు. కనుక నేడో రేపో మంత్రివర్గ సమావేశం నిర్వహించి, ముందస్తు ఎన్నికలు..వాటికి ముందు ప్రకటించవలసిన వరాల గురించి మంత్రులతో చర్చించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2న ప్రగతి నివేధన సభ తరువాత మళ్ళీ మరోమారు మంత్రివర్గ సమావేశం నిర్వహించి, అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలతో కలిసి తెలంగాణా కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకొంటే సెప్టెంబర్ 10వ తేదీలోగా అసెంబ్లీని రద్దు చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ కు తెలియజేయవలసి ఉంటుంది. టిఆర్ఎస్‌ హడావుడి చూస్తుంటే 10వ తేదీలోగా అసెంబ్లీని రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజులలోనే దీనిపై మరింత స్పష్టత రావచ్చు.