కెసిఆర్‌కు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు

సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ల మద్య మరో సరికొత్త యుద్దానికి నాంది పలికింది. “ఐదేళ్ళు పాలించమని ప్రజలు టిఆర్ఎస్‌కు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారు?” అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. “ఇంతకాలం ఎన్నికలు-ఎన్నికలు అని కలవరించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ముందస్తు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు?” అని టిఆర్ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఒకరి ప్రశ్నకు మరొకరు నేరుగా సమాధానం మాత్రం  చెప్పకపోవడం గమనిస్తే రెండు పార్టీలు ఈ విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అర్ధం అవుతోంది. 

కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కొంగర ఖలాన్‌లో టిఆర్ఎస్‌ పెట్టుకోబోయే సభకు ‘ప్రగతి నివేధన సభ’ అని కాక ‘టిఆర్ఎస్‌ ఆవేధన సభ’ అని పేరు పెట్టుకొంటే బాగుంటుంది. ఎందుకంటే సిఎం కెసిఆర్‌ ఈ నాలుగేళ్లలో చేసిందేమీ లేదు. సుమారు 25 లక్షల మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించడానికి ఎంత లేదన్నా అన్ని ఏర్పాట్లు చేయడానికి రూ.500 కోట్లు ఖర్చవుతుంది. అంతా డబ్బు టిఆర్ఎస్‌కు ఎక్కడి నుంచి వస్తోంది. ఇక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ ఒక్కొక్కరికీ కోటి రూపాయలు చొప్పున డబ్బాలలో పెట్టి ఇచ్చినట్లు నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఆ డబ్బు ఎక్కడిది?” అని ప్రశ్నించారు. 

“ప్రజలందరూ మావైపే ఉన్నారని పదేపదే చెప్పుకొనే సిఎం కెసిఆర్‌, ఐదేళ్ళు పాలించమని అధికారం అప్పగిస్తే ముందే ఎందుకు పదవిలో నుంచి దిగిపోవాలనుకొంటున్నారు? 133 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎన్నికలను ఎదుర్కొందో ఎవరూ చెప్పలేరు. ఇక ముందు కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే ఎప్పుడూ భయం లేదు. కానీ సిఎం కెసిఆరే భయపడి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినవారెవరూ గెలిచిన దాఖలాలు లేవు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అందుకు ఉదాహరణలుగా ఉన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ తీయాలనే దురాలోచనతో ముందస్తు ఎన్నికలకు వెలుతున్న కెసిఆర్‌కు కూడా ఓటమి తప్పదు. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ అని ఊదరగొట్టిన మోడీ సర్కార్ ఇప్పుడు కెసిఆర్‌కు ఎందుకు మినహాయింపు ఇస్తోంది? దాని వలన ప్రజా ధనం వృధా కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.