
తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకొన్న జోనల్ వ్యవస్థ గురించి కేంద్రప్రభుత్వం లేవనెత్తిన సందేహాలను మొన్న సిఎం కెసిఆర్ ప్రధాని మోడీని కలిసి మాట్లాడి నివృత్తి చేయడంతో ఆయన దానికి సంబందించిన ఫైలుపై సంతకం చేసి కేంద్ర హోంశాఖకు పంపించారు. దీని గురించి సిఎం కెసిఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగుతో కూడా మాట్లాడారు కనుక ఈరోజు సాయంత్రంలోగా ఆ ఫైలు అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకొనే అవకాశం ఉంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజే దానిపై సంతకం చేసినట్లయితే మంగళవారం దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వులతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే లభిస్తాయి. ఈసారి 31 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రానికే పరిమితమైన జోనల్ వ్యవస్థ రూపొందించబడింది కనుక ఇకపై బదిలీల విషయంలో కూడా గతంలో మాదిరిగా గందరగోళం ఉండదు.