సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివార్లలో ‘ప్రగతి నివేధన’ పేరిట సుమారు 25లక్షలమందితో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం అప్పుడే టిఆర్ఎస్ నేతలు, మంత్రులు ఏర్పాట్లు మొదలుపెట్టేరు కూడా. వాటిపై తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ చాలా ఘాటుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
“మేము సభలు, సమావేశాలు జరుపుకొంటామంటే ఏదో వంకతో అనుమతి నిరాకరిస్తుంటారు. కానీ టిఆర్ఎస్ సభలకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. క్షణాలలోనే అన్ని అనుమతులు లభించేస్తాయి. మా సభలకు స్కూలు బస్సులు వాడుకోవడానికి అనుమతి కోరితే నిబంధనలు అడ్డువస్తాయి. కనుక ప్రగతి నివేధన సభకుస్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు వాడినట్లయితే మేము హైకోర్టులో దావా వేస్తాము. అలాగే ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలపై ఒత్తిడి తెచ్చి ప్రగతి నివేధన సభకు ఉచితంగా ఆహారం, టెంట్లు, వేదిక ఏర్పాట్లు చేయాలని ప్రయత్నించినా మేము ఊరుకోము. కోర్టులో దావా వేసి ప్రభుత్వాన్ని సదరు వ్యక్తులను నిలదీస్తాం. ఏ ప్రభుత్వాధికారి అధికార దుర్వినియోగానికి పాలపడినా వారిపై కేసులు వేస్తాం,” అని కోదండరామ్ హెచ్చరించారు.