హైదరాబాద్‌ మెట్రో కబుర్లు

హైదరాబాద్‌ వాసులకు ఒక శుభవార్త. పాతబస్తీ మీదుగా సాగే ఎంజిబిఎస్-ఫలక్ నూమా కారిడార్ నిర్మాణ పనులు త్వరలో మొదలుకాబోతున్నాయి. చాంద్రాయణగుట్ట మజ్లీస్ ఎమెల్యే, మజ్లీస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డి మెట్రో, ఎల్&టి సంస్థ  అధికారులు, ఇంజనీర్లతో కలిసి శుక్రవారం పాతబస్తీలో మెట్రో కారిడార్ నిర్మించబోయే ప్రాంతాలలో పర్యటించారు. పాతబస్తీలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ఇంతకాలం అభ్యంతరాలు చెపుతున్న మజ్లీస్ నేతలు ఇప్పుడు మెట్రో కారిడార్ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇవ్వడంతో బహుశః నేటి నుంచి పాతబస్తీలో మెట్రో పిల్లర్ల నిర్మాణానికి మార్కింగ్స్ వేసే కార్యక్రమం మొదలుపెట్టవచ్చు. 

నిజానికి ఈ కారిడార్ లో పనులు ఎప్పుడో మొదలుపెట్టవలసి ఉంది. కానీ పాతబస్తీలో చారిత్రాత్మకమైన కట్టడాలకు నష్టం జరుగుతుందని, కనుక మెట్రో కారిడార్ అలైన్మెంట్ లో మార్పు చేయాలని మజ్లీస్ నేతలు పట్టుబట్టడంతో నిర్మాణపనులు మొదలవలేదు. ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలోనే కారిడార్ నిర్మించబోతున్నారు. 

దార్-ఉల్-షిఫా వద్ద గల ఎంజిబిఎస్ నుండి పురానా హవేలీ-ఐత్ బార్ చౌక్, వోల్టా హోటల్-సుల్తాన్ షాహీ-షాలిబండ-సయ్యద్ ఆలీ చభుత్ర-షంషీర్ గంజ్ మీదుగా ఫలక్ నూమా వరకు ఈ మెట్రో కారిడార్ నిర్మించబడుతుంది. ఈ మార్గంలో సాలార్ జంగ్ మ్యూజియం, ఛార్మినార్, షాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నూమా వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించబోతున్నారు. 

ఈ కారిడార్ లో దార్-ఉల్-షిఫా నుంచి షాలిబండ వరకు ప్రస్తుతం 60 అడుగుల వెడల్పు రోడ్డు, అక్కడి నుంచి ఫలక్ నూమా వరకు  80 అడుగుల వెడల్పు రోడ్డు ఉంది. మెట్రో కారిడార్ వస్తే ఈ మార్గంలో రోడ్ ట్రాఫిక్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కనుక దార్-ఉల్-షిఫా నుంచి ఫలక్ నూమా వరకు  రోడ్డును 100 అడుగుల వెడల్పు చేయాలని జిహెచ్ఎంసి ప్రతిపాదిస్తోంది. దీనిపై మజ్లీస్ నేతలు-జిహెచ్ఎంసి అధికారుల మద్య చర్చలు సాగుతున్నాయి.