ముందస్తుకు ముంపు మండలాలు బ్రేక్?

పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతాయనే కారణంతో తెలంగాణాలో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, కూనవరం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, రామచంద్రాపురం ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపేసింది మోడీ సర్కార్. ఇది జరిగి నాలుగేళ్ళు పూర్తయ్యి మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ ఇంతవరకు వాటి విలీనానికి సంబందించి అధికారిక గెజిట్ వెలువడకపోవడంతో వాటి పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాలపై సందిగ్దత నెలకొని ఉంది. ఈ కారణంగా ఎన్నికల సంఘం ఆ మూడు నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పులు చేయలేకపోతోంది. ఈ ఏడు మండలాలను తెలంగాణా నుంచి ఆంద్రాలో విలీనం చేయడం వలన ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, మూడు నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎమ్మేల్యేలు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నారు. కనుక ఈ ఏడు మండలాలలో ఓటర్ల జాబితాలు సవరిస్తే కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు డిల్లీలో ప్రధాని మోడీతో సమావేశం కానున్న సిఎం కెసిఆర్‌ ఈ అంశంపై గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది.