
నిన్న తెలంగాణా భవన్లో టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పూర్తయ్యేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరి మొహాలు సంతోషంతో కళకళలాడిపోసాగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నాలుగురైదుగురికి తప్ప మిగిలిన వారందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తానని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనే అందుకు కారణం.
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సుమారు 30-40 మంది పనితీరుపట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, వారిని కెసిఆర్ హెచ్చరించారని, అయినప్పటికీ వారి పనితీరు మెరుగుపరుచుకోనందున వచ్చే ఎన్నికలలో వారికి టికెట్స్ లభించే అవకాశాలు ఉండకపోవచ్చని మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అయితే సిఎం కెసిఆర్ నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, ఆ వార్తలను పట్టించుకోవద్దని, సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నాలుగురైదుగురికి తప్ప మిగిలిన వారందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తానని స్వయంగా చెప్పడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల మొహాలు సంతోషంతో కళకళలాడాయి. వారికి టికెట్స్ ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించుకొనే బాధ్యత కూడా తనదేనని సిఎం కెసిఆర్ చెప్పడం వారికి మరింత ఉత్సాహానిచ్చింది. కనుక ఇక నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రెట్టించిన ఉత్సాహంతో తమ ప్రత్యర్ధులను డ్డీకొనబోతున్నారు.
టికెట్స్ ఇవ్వని నాలుగురైదుగురికి కూడా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి కడుపులో పెట్టుకొని కాపాడుకొంటామని సిఎం కెసిఆర్ స్వయంగా చెప్పడంతో వారు కూడా సంతృప్తి చెందారు.
సిఎం కెసిఆర్ చేసిన ఈ ప్రకటన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొత్త జోష్ నింపినప్పటికీ టికెట్స్ ఆశిస్తున్నవారికి మాత్రం ఇది చాలా ఆశాభంగం కలిగిస్తుంది కనుక త్వరలోనే టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్, బిజెపి,టిడిపి, బిఎల్ఎఫ్, టిజెఎస్ తదితర పార్టీలలోకి వలసలు మొదలవవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇవ్వబోతున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు గనుక టిఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లు ఖరారు అయిపోయినట్లే. కానీ వేర్వేరు కారణాల చేత కొంతమందికి వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయవలసివస్తుంది కనుక ఆ ఒక్క విషయమే ఇంకా తెలియవలసి ఉంది.