ముందస్తుపై రాష్ట్ర బిజెపి అయోమయం?

సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల గంట కొట్టగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ‘ముందస్తు ఎందుకు?’ అని ప్రశ్నిస్తూనే ఎన్నికల సన్నాహాలు చేసుకొంటున్నాయి. రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నట్లున్నారు.       రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, “ముందస్తు ఎన్నికలు కెసిఆర్‌ చేస్తున్న మరో రాజకీయ జిమ్మిక్కు మాత్రమే. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు. కెసిఆర్‌కు ఎంతసేపు ఎన్నికలు, అధికారం గురించి ఆలోచనలే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల సమస్యలు పట్టవు. తన కంటికి చికిత్స చేయించుకోవడానికి డిల్లీ వెళతారు కానీ రాష్ట్రంలో పేదప్రజలు వైద్యానికి నోచుకోరు. పండుగలు, పబ్బలకు, కొత్త భవనాల నిర్మాణానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు కానీ పేద ప్రజల కోసం డబ్బు ఖర్చుపెట్టడానికి వెనకాడుతుంటారు. పేదల కోసం డయాలసిస్ సెంటర్లు ఆర్భాటంగా ప్రారంభించారు కానీ వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయో చెప్పగలరా? ఉస్మానియా ఆసుపత్రి మరమత్తులకు అవసరమైన నిధులు మంజూరు చేయలేరు కానీ ప్రగతి నివేధన సభకు వందల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అలాగే రోజుకో కొత్తపధకం ప్రకటిస్తుంటారు. బహిరంగసభలలో అప్పటికప్పుడు కోట్లు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. కానీ రూ.200 కోట్లు ప్రకటిస్తే రూ.6 కోట్లు మాత్రమే ఇస్తారు. ప్రజలను పట్టించుకోకుండా అధికారం కోసం అర్రులు చాస్తున్న ఇటువంటి టిఆర్ఎస్‌తో మేము ఎన్నికల పొత్తులు పెట్టుకొంటామనుకోవడం అవివేకమే,” అని అన్నారు. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల చాలా శ్రద్ద చూపుతున్నదని అందరికీ తెలుసు. ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు, చికిత్సల కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ‘కంటి వెలుగు’ పధకం అమలవుతోంది. వాటితోపాటే సుగర్, బీపీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. నిరుపేద డయాబెటీస్ రోగుల కోసం ప్రతీ జిల్లాకేంద్రంలో ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసింది. నిరుపేద గర్భిణీ స్త్రీల కోసం కెసిఆర్‌ కిట్స్ పధకం రెండేళ్ల క్రితం నుంచే అమలుచేస్తోంది. అంగన్వాడీ, మాతాశిశుసంరక్షణాలయాలలో పేదపిల్లలకు బాలామృతం అనే పౌష్టికాహారం అందిస్తోంది. రాష్ట్రంలో భోధకాలు వ్యాధిగ్రస్తులకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. ఈవిధంగా చెప్పుకొంటూపోతే టిఆర్ఎస్‌ సర్కారు నిరుపేదప్రజల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల జాబితా చాలా పెద్దదే కనబడుతుంది. కానీ ఇవేవీ రాష్ట్ర బిజెపి నేతలకు కనబడకపోవడం విచిత్రంగానే ఉంది. 

ఇక ముందస్తు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సిఎం కెసిఆర్‌ నేరుగా ప్రధాని మోడీతోనే చర్చిస్తున్నప్పుడు, ముందస్తు ఎన్నికలు రావని, అదొక జిమిక్కు మాత్రమేనని శ్రీధర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇక టిఆర్ఎస్‌ ఏనాడూ రాష్ట్ర బిజెపితో పొత్తులు పెట్టుకోవాలనుకోలేదు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాయే స్వయంగా టిఆర్ఎస్‌తో పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నించారు కానీ దానికీ సిఎం కెసిఆర్‌ అంగీకరించలేదనే సంగతి బహుశః శ్రీధర్ రెడ్డికి గుర్తులేదేమో? కనుక రాష్ట్ర బిజెపి నేతలు ముందు ఈ అయోమయం నుంచి బయటపడి ఎన్నికలకు సిద్దం అయితే మంచిదేమో?