ఛలో బయ్యారం: టిడిపి

సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల గంట మ్రోగిస్తున్నారు కనుక టిడిపి కూడా సన్నాహాలు ప్రారంభించింది. విభజన హామీలలో ఒకటైన బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ టిడిపి శనివారం ‘ఛలో బయ్యారం’  కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ప్రకటించారు. 

శుక్రవారం టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ సర్కారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేదు. కనీసం రాష్ట్ర విభజన సమయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు గట్టిగా పట్టుబట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజన వంటి హామీలను అమలుచేయించడంలో టిఆర్ఎస్‌ సర్కారు చాలా ఘోరంగా విఫలమయింది. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోంది తప్ప దానిపై టిఆర్ఎస్‌ సర్కారుకు చిత్తశుద్ధి లేదు. ఉంది ఉంటే దానికి జాతీయహోదా కోసం గట్టిగా పట్టుబట్టి ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించగలిగి ఉంటే దాని కోసం చేస్తున్న అప్పుల భారం రాష్ట్ర ప్రజలపై పడేది కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వలననే కేంద్రం మాట తప్పింది. హామీల అమలులో ఘోరంగా విఫలమైన టిఆర్ఎస్‌ సర్కారును నిలదీసేందుకు శనివారం తెలుగుదేశం పార్టీ ‘ఛలో బయ్యారం’  కార్యక్రమం నిర్వహిస్తుంది,” అని చెప్పారు.