ఇదేమిటి సిద్దూ?

మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదంలో చిక్కుకొన్నాడు. ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకొని ఆయనతో సరదాగా కబుర్లు చెప్పాడు. ఆ తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ చీఫ్ పక్కనే కూర్చొని ఆయనతో కూడా కబుర్లు చెప్పాడు. 

సిద్దూ చర్యలను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం తప్పు పట్టారు. ఒకపక్క సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ మన జవానులపై కాల్పులు జరుపుతుంటే సిద్దూ వెళ్ళి పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకొని ఆయనతో ముచ్చట్లేమిటని బిజెపి, అకాలీదళ్ నేతలు ప్రశ్నించారు. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్-పాక్ మద్య వివాదం నెలకొని ఉండగా సిద్దూ వెళ్ళి పాక్ ఆక్రమిత కాశ్మీర్ చీఫ్ తో మాట్లాడటాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. దేశగౌరవాన్ని, భారత్ జవాన్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా సిద్ధూ వ్యవహరించాడని, సిద్దూ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని బిజెపి, అకాలీదళ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఉద్దేశ్యపూర్వకంగా వారితో ముచ్చట్లు పెట్టుకోలేదని, ఆ సందర్భంలో మర్యాద కోసమే ఆవిధంగా వ్యవహరించవలసి వచ్చిందని సిద్దూ సమర్ధించుకున్నాడు.