
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నుంచి బుధవారం అనుమతి లభించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చేసినట్లే. జలవనరుల శాఖ కార్యదర్శి యుపి కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్వర్యంలో బుధవారం డిల్లీలో టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కేంద్ర జలసంఘం చైర్మన్, భూగర్భాజలవనరుల శాఖా కమీషనర్, వ్యవసాయ శాఖా, గిరిజన శాఖ లకు చెందిన ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్ సలహాదారు, కేంద్ర ఆర్ధికశాఖ సంయుక్త కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంజనీర్ ఇన్-ఛీఫ్ (ఇరిగేషన్) మురళీధర్ రావు, ఇంజనీర్ ఇన్-ఛీఫ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) హరిరాం ఆ సమావేశంలో పాల్గొని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక అంశాల గురించి వివరించి వారి సందేహాలన్నీ నివృతి చేశారు. వారి వివరణలతో సంతృప్తి చెందిన కమిటీ సభ్యులు సమావేశం పూర్తికాగానే అందరూ ఏకగ్రీవంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి టెక్నికల్ క్లియరెన్స్ మంజూరు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చేసినట్లే. ఇక దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లయితే, ఇక నిధుల కోసం వెతుకలాట తప్పుతుంది.