
ఇటీవల మొయినాబాద్ ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీ టీడీపి ఎంపీ పుట్టా మహేష్ తదితరులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ ఈగిల్ టీమ్‌కు రెడ్ హ్యాండడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా అది నిందితుల విచారణ చేపట్టింది.
అయితే ఈ కేసుకి సంబంధం లేని మరో పరిణామం నేడు జరిగింది. రెవెన్యూ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్హౌసుని స్వాధీనం చేసుకొని తాళం వేశారు. దానిని నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో నిర్మించారని రెవెన్యూ అధికారులు చెప్పారు. తాము ల్యాండ్ రికార్డులు పరిశీలించి ఈ విషయం ధ్రువీకరించుకున్నామని చెప్పారు. కనుక అసైన్డ్ భూమి కబ్జా చేసి ఫామ్‌హౌసు నిర్మించినందుకు రోహిత్ రెడ్డిపై మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
సిట్ అధికారులు త్వరలో రోహిత్ రెడ్డి కస్టడీలోకి తీసుకొని ఫామ్‌హౌసులో జరిగిన డ్రగ్స్ పార్టీ గురించి ప్రశ్నించనుంది. అవసరమైతే ఆయనను ఫామ్‌హౌసుకి తీసుకువెళ్ళి విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.