మరి అప్పుడు ఎందుకు తగ్గించలేదో..

కర్ణాటక ఎన్నికలు ముగిసేవరకు సుమారు రెండు వారాలపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగకుండా కేంద్రప్రభుత్వం పెట్రోలియం కంపెనీలను నియంత్రించింది. ఎన్నికలు పూర్తికాగానే వాటిష్టం వచ్చినట్లు పెంచుకోవడం మొదలుపెట్టాయి. గత నాలుగైదు రోజులలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు ఒక రూపాయి వరకు పెరగడంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షరా మామూలుగా, ఈ సమస్యపై కూడా కాంగ్రెస్, భాజపాల మద్య మాటల యుద్ధం మొదలైపోయింది. 

మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం దీనిపై స్పందిస్తూ, “అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గడం వలన కేంద్రానికి ప్రతీ లీటరుపై సుమారు రూ.15 వరకు ఆదా అవుతోంది. కేంద్రం పన్ను రూపంలో అదనంగా లీటరుపై మరో రూ.10 వరకు వసూలు చేస్తోంది. ఒకవేళ కేంద్రప్రభుత్వానికి నిజంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే, ఆ రెండూ కలుపుకొని లీటరుకు రూ.25 వరకు తగ్గించవచ్చు. కానీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు లీటరుకు 1-2 రూపాయిలు మాత్రమే తగ్గిస్తూ దేశప్రజలను మోసం చేస్తోంది,” అని ట్వీట్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరల కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై వసూలు చేసుకొంటున్న పన్నులే ఎక్కువ అని అందరికీ తెలుసు. సామాన్య ప్రజలకు మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పనంగా వచ్చిపడుతున్న ఆ సొమ్మును వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరుగుతూనే ఉంటాయి తప్ప బారీగా తగ్గిన దాఖలాలు లేవు. 

ఇప్పుడు మోడీ సర్కార్ ను విమర్శిస్తున్న చిదంబరం తమ ప్రభుత్వం హయంలో లీటరుకు రూ.25 తగ్గించి ఉండి ఉంటే నేడు ఆయన వాదనకు అర్ధముండేది. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పిండుకొని, ఇప్పుడు మోడీ సర్కార్ ప్రజలను పిండేస్తోందని అయన మోసలి కన్నీళ్లు కార్చడం చాలా విడ్డూరంగా ఉంది. 

కాంగ్రెస్ పార్టీకి ప్రజలపై నిజంగా అంత ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ హామీ చేర్చవచ్చు కదా? తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  లీటరుకు రూ.25 తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగలదా?