
మెదక్ పట్టణ శివారులో ఔరంగాబాద్ వద్ద నిన్న జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, “మెదక్ జిల్లాలో పుట్టిన నేను ఈజిల్లా రుణం ఈవిధంగా తీర్చుకొనే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి నేను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగారిని కలిసినప్పుడు అయన నాతో ఒక విషయం చెప్పారు. ‘సాధారణంగా చాలామందికి తాము చేసిన కృషికి ఫలితం, గుర్తింపు వారి జీవితకాలంలో లభించదు. కానీ మీకు మాత్రం ఆ భాగ్యం లభించింది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడి దానిని మీ జీవితకాలంలోనే సాధించుకోగలిగారు. మీరు చాలా అదృష్టవంతులు,’ అని అన్నారు.
“నిజమే! ఎన్నో సినిమాలలో నటించిన గొప్పగొప్ప నటులకు దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులు వారి జీవితకాలంలో లభించవు. అలాగే ప్రతిష్టాత్మకమైన భారతరత్న వంటి అవార్డులు కూడా సదరు వ్యక్తుల జీవితకాలంలో అందుకోలేరు. వారు చనిపోయిన తరువాతో లేకపోతే వాటిని ఆస్వాదించలేని పరిస్థితులలో వారున్నప్పుడో అవి లభిస్తుంటాయి. కానీ నేను జీవించి ఉండగానే తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగాను. ఆ తరువాత నేను జీవించి ఉండగానే తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాను. నేను పుట్టిన ఈ మెదక్ ను జిల్లాగా చేయగలిగాను. ఆ జిల్లాకు నేడు సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనానికి నేడు నా చేతులహోనే నేను శంఖుస్థాపన చేయగలుగుతున్నాను. నా జీవిత కాలంలోనే ఇవన్నీ సాధ్యపడటం నిజంగా నా అదృష్టం. మరే మనిషికి దక్కని అదృష్టం నాకు దక్కిందని నేను భావిస్తున్నాను. పుట్టి పెరిగిన గడ్డకు, నా ఈ ఉన్నతికి కారకులైన మీ అందరికీ ఈవిధంగా సేవ చేసుకొనే భాగ్యం కేవలం నాకు మాత్రమే దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకు నాకు గుండెల నిండా సంతోషం కలుగుతోంది,” అని సిఎం కెసిఆర్ అన్నారు.