దాని మద్దతు అవసరం లేదుట!

మే 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ ఎన్నికలలో కూడా గెలిచి రాష్ట్రంలో తన అధికారాన్ని నిలుపుకోవాలని ఆరాటపడుతుంటే, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో విజయపతాక ఎగురవేసిన భాజపా, ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి, మళ్ళీ దక్షిణాదిన కూడా తేన జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. అయితే, నెలరోజుల క్రితం వెలువడిన సర్వే ఫలితాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, భాజపా ప్రదర్శిస్తున్న దూకుడు కారణంగా రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు వస్తాయని, రాష్ట్రంలో ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడబోతోందని తాజా సర్వే ఫలితాలు జోస్యం చెప్పాయి. 

ఒకవేళ సర్వేలలో చెప్పినట్లుగా కాంగ్రెస్, భాజపాలలో దేనికీ మెజార్టీ రాకపోతే, అప్పుడు మూడవ స్థానంలో ఉన్న జెడిఎస్ పార్టీ ‘కింగ్ మేకర్’ అవుతుంది. కనుక ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రెండు పార్టీలకు జెడిఎస్ మద్దతు తప్పనిసరి అవుతుంది. అది గ్రహించబట్టే జెడిఎస్ పట్ల భాజపా నేతలు కాస్త మెతక వైఖరి అవలంభిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఆ రెండు పార్టీలు రహస్య అవగాహనకు వచ్చి, ఎదుట పార్టీని గెలిపించేందుకు వీలుగా బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జెడిఎస్ అధినేత దేవగౌడ గురించి సానుకూలంగా మాట్లాడటం కూడ అందుకేనని భావించవచ్చు. 

భాజపా దూరదృష్టితో జెడిఎస్ పట్ల కాస్త మెతక వైఖరి అవలంభిస్తుంటే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం తమకు జెడిఎస్ మద్దతు అవసరంలేదని పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని చెప్పడం విశేషం. అయితే ఎన్నికలు పూర్తవగానే ఏ పార్టీకి ఎంత మెజార్టీ రావచ్చో తేలిపోతుంది కనుక అవసరమైతే అప్పుడు రెండు పార్టీలు కూడా జెడిఎస్ తో పొత్తుల కోసం సంప్రదింపులు మొదలుపెట్టడం తధ్యం. 

కానీ కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో జెడిఎస్ కూడా చేరాలనుకొంటుంన్నందున, ‘ఒకవేళ కర్ణాటకలో జెడిఎస్ అధికారంలోకి రాలేకపోతే ప్రతిపక్ష బెంచీలలో కూర్చోంటామే తప్ప కాంగ్రెస్, భాజపాలలో దేనికీ మద్దతు ఇవ్వబోమని’ అ పార్టీ ముఖ్యమంత్రిఅభ్యర్ధి కుమారస్వామి గౌడ ఇటీవలే ప్రకటించారు. కనుక ఈసారి కర్ణాటక ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఒకవేళ సర్వేలలో ఊహించినట్లుగా రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే, గోవా, ఈశాన్య రాష్ట్రాలలో చేసినట్లుగానే కర్ణాటకలో కూడా భాజపా తెరవెనుక ప్రయత్నాలు చేసి అధికారం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.