
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ని నందినగర్‌లోని ఆయన నివాసంలో రెండవ అంతస్తులో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రశ్నిస్తున్నారు. ఆయన అభ్యర్ధన మేరకు మాజీ ఎంపీ సంతోష్ రావు ఒక్కరినే ఆయనతో పాటు విచారణలో పాల్గొనేందుకు అనుమతించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కింద అంతస్తులో ఉండేందుకు అనుమతించారు. వీరు ముగ్గురూ, సిట్ అధికారులు తప్ప మరెవరూ లోపల లేరు.
ఓ పక్క సిట్ అధికారులు కేసీఆర్‌ని ప్రశ్నిస్తుంటే, మరోపక్క నగరంలో పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం నల్ల జెండాలతో హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డగించారు.
కానీ పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మరికొందరిని అరెస్ట్ చేసి వ్యానులో అక్కడి నుంచి తరలించారు. నగరంలో సచివాలయంతో సహా పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి వ్యానులలో అక్కడి నుంచి తరలిస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న హడావుడిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ, “ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. రాజకీయ కక్ష సాధించాలని మేమనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ రెండేళ్ళుగా స్వేచ్చగా రోడ్లపై తిరగగలిగేవారా? కేసీఆర్ ఏ తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు?
ఆయనని సిట్ అధికారులు ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హడావుడి చూస్తుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లే ఉంది.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ చేయకూడని పాపాలు చేశారు. కనుక వారు ముగ్గురూ వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కేసు, విచారణతో మా ప్రభుత్వానికేమీ సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతోంది అంతే!,” అని అన్నారు.