
రెవెన్యూశాఖలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక శుభవార్త. వారి ఉద్యోగాలు క్రమబద్దీకరించేందుకు వీలుగా వారందరినీ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో అటెండర్లు, డ్రైవర్లుగా నియమించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 23,099 మంది వీఆర్‌ఏలు ఉన్నారు. వారిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ‘లాస్ట్ గ్రేడ్ సర్వీసస్’ పరిధిలోకి వచ్చే ఈ ఉద్యోగాలలో 30 శాతం వీఆర్‌ఏలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా వారికి రెవెన్యూ శాఖలోనే 30 శాతం, గ్రామ రెవెన్యూ అధికారులు (విఆర్ఓ) పోస్టులలో 30 శాతం చొప్పున భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూశాఖలో పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అయ్యే స్థానాలలో వారిని నియమించదానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇతరశాఖాలలో భర్తీకి టి.ఎస్.పి.ఎస్.సి.నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంటుంది. దానికి కూడా సన్నాహాలు మొదలైనట్లు సమాచారం.