
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇటీవల జరిగిన పోలీస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన శారీరకధారుడ్య, వైద్య పరీక్షలకు హాజరైనవారిలో ఏస్సీ, ఎస్టీ అభ్యర్ధులను కించపరిచేవిధంగా పోలీస్ అధికారులు వ్యవహరించారు. వారి ఛాతిపై ‘ఎస్సీ’ ‘ఎస్టీ’ అని ఇంకుతో వ్రాశారు. ఈ ఘటన ధార్ జిల్లా ప్రభుత్వాసపత్రిలో జరిగింది. పోలీస్ రిక్రూట్మెంటులో ఏస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి కనుక వారిని గుర్తించడం కోసమే ఈవిధంగా చేశామని అధికారులు సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు తమ దరఖాస్తులలోనే తమ కులానికి సబంధించిన వివరాలు వ్రాసి ఇచ్చినప్పుడు మళ్ళీ వారిని గుర్తించడానికి వారి ఛాతిపై అభ్యర్ధి కులాన్ని వ్రాయడం చాలా దారుణం. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధార్ జిల్లా ఎస్పి బీరేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.