టిజెఎస్ అధ్యక్షుడిగా కోదండరాం ఎన్నిక

ఆదివారం సరూర్ నగర్ మైదానంలో తెలంగాణా జనసమితి (టిజెఎస్) ఆవిర్భావసభ జరిగింది. ఆ సభలో ప్రొఫెసర్ కోదండరాం టిజెఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా అయన పార్టీ జెండాను ఆవిష్కరించారు.   

ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగిస్తూ, తెలంగాణా ప్రజలందరూ కలిసి కోట్లాడి తెలంగాణా సాధించుకొంటే, అది తెరాస ఘనతే అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణా రాష్ట్రం వస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అందరూ తెరాసకు ఓట్లేసి గెలిపించుకొంటే, రాష్ట్రంలో నియంతృత్వ అప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు కానీ కెసిఆర్ కుటుంబం పదవులు, అధికారం దక్కించుకొని బాగుపడిందని అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక కొందరు తెరాస నేతలు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని, రాష్ట్రంలో సామాన్య, బడుగుబలహీన వర్గాల ప్రజల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని ప్రొఫెసర్ కోదండరాం అవేధన వ్యక్తం చేశారు. 

ప్రొఫెసర్ కోదండరాం తన ప్రసంగంలో తెరాస సర్కార్ పరిపాల తీరుతెన్నులు, అది చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. ప్రతీ అంశంపై మాట్లాడి వాటిలో తప్పొప్పులను వివరించి చెప్పారు. వాటిని సరిదిద్దుకోమని తాము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా తెరాస సర్కార్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తోందని, ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా నిరంకుశ పాలన సాగిస్తున్న తెరాసను గద్దె దించి రాష్ట్రంలో పారదర్శకమైన, సమర్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే తెలంగాణా జనసమితి ఆవిర్భవించిందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.