
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో చర్చించేందుకు సిఎం కెసిఆర్ ఆదివారం చెన్నై వెళ్ళారు. అక్కడ ఆ పార్టీ అధినేత కరుణానిధిని కలిసి మాట్లాడిన తరువాత ఆయన కుమారుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో సమావేశమయ్యారు. అనంతరం వారివురురూ మీడియాతో మాట్లాడారు.
సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, “దేశరాజకీయాలలో కురువృద్ధుడు వంటి కరుణానిధిగారిని కలిశాను. అయన నాకు ఆలోచనలను, ప్రతిపాదనలను వివరించినప్పుడు, నాకు చక్కటి దిశానిర్దేశం చేశారు. అలాగే నాకు కొన్ని పుస్తకాలు కూడా బహుమతిగా ఇచ్చారు. పెద్దాయన ఆశీర్వాదాలు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తరువాత మేము స్టాలిన్ గారితో దేశరాజకీయాల గురించి లోతుగా చర్చించాము. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు అవసరమని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయం, విద్యా, వైద్య తదితర రంగాలపై కేంద్రప్రభుత్వం పెత్తనం ఎందుకు? వాటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించవలసిన అవసరం ఉంది. రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల వాటాను కూడా మరింత పెంచవలసి ఉంది. కేంద్రప్రభుత్వం దేశరక్షణ, ఆర్ధిక వ్యవస్థ, విదేశీవిధానాలు మొదలైన కొన్ని బాధ్యతలకు పరిమితమయి రాష్ట్రాలకు మరింత స్వేచ్చ, హక్కులు కల్పించాలి.
గత 70 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, భాజపాలు అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాల వలననే నేడు దేశం ఈ దుస్థితిలో ఉంది. ఈ పరిస్థితులను మార్చుకోగిలిగినప్పుడే మన దేశం అగ్రదేశాల సరసన నిలబడగలదు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించాను. ఇది ఆషామాషీ ఫ్రంట్ కాదు. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం నిజాయితీతో చేస్తున్న కృషి. కనుక అందరూ మా ప్రయత్నాన్ని తేలికచేసి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇవ్వాళ్ళ మేము అనేక విషయాలపై మాట్లడుకొన్నాము. అయితే ఇప్పటికిప్పుడు ఆ వివరాలన్నీ బయటపెట్టలేను. మాతో కలిసివచ్చే అందరితో మాట్లాడి, విధివిధానాలు, కార్యాచరణను నిర్ణయించుకొన్న తరువాత అప్పుడు అన్ని వివరాలు మేమే చెపుతాము. బహుశః దీనికి మూడు నాలుగు నెలల సమయం పట్టవచ్చు.
ఇవ్వాళ్ళ నేను చెప్పిన విషయాలపై స్టాలిన్ గారు సానుకూలంగా స్పందించారు. వారికి తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలు..వాటి ఫలితాల గురించి వివరించాము. మే 10వ తేదీన రైతు బంధు పధకం క్రింద రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రమ్మని స్టాలిన్ గారిని ఆహ్వానించాము. అందుకు అయన అంగీకరించడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని కెసిఆర్ అన్నారు.