
ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమాను చూసిన రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్, ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన మహేష్ బాబును, ఆ సినిమా దర్శకుడు కొరటాల శివను అభినందించారు. ఈ సందర్భంగా ఆ సినిమాపై ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ‘ఈనాడు’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వారు ముగ్గురూ పాల్గొన్నారు. అది రాజకీయ బ్యాక్ డ్రాప్ తో తీసిన సినిమా కనుక వారి చర్చలలో ఆ సినిమాతో పాటు ఇంకా అనేక విషయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఈ సినిమాలో ‘పాలకులు ప్రజలకు జవాబుదారితనంతో వ్యవహరించాలనే సందేశం’ నాకు నచ్చిందని కేటిఆర్ అన్నారు. అలాగే ప్రజలు, మీడియా, సమాజంలో అందరూ కూడా క్రమశిక్షణగా, భాద్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందని అన్నారు. సినిమాలో ఒక సన్నివేశంలో ‘మనం చాలా హీనంగా, అనాగరికంగా వ్యవహరిస్తున్నాము’ అని మహేష్ బాబు పలికిన డైలాగ్ ను గుర్తుచేసుకొంటూ, ‘అది వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా అది చేదునిజమని’ కేటిఆర్ అన్నారు.
మన తప్పులను, లోపాలను, బాధ్యతారాహిత్యాన్ని నిజాయితీగా అంగీకరించినప్పుడే వాటిని సరిదిద్దుకోగలుగుతామని అన్నారు. ఈ సందర్భంగా విదేశాలలో ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తుంటారు...మన దేశంలో ప్రజలు ఏవిధంగా క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరిస్తుంటారో ఉదాహరణలతో సహా కేటిఆర్ వివరించిన తీరు చాలా బాగుంది.
ఈ సమస్యకు పరిష్కారం చట్టాల ద్వారా కాక, చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా పరిష్కరించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతీ సినిమాలో కూడా హీరోల ద్వారా అన్యాపదేశంగా ఇటువంటి విషయాలపై ప్రజలకు చిన్న సందేశం చెప్పించాలని మంత్రి కేటిఆర్ కోరగా మహేష్ బాబు, దర్శకుడు కొరటాల అంగీకరించారు. తమ వంటి రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిన దానికంటే సినిమాలలో హీరోలు చెపితేనే ప్రజలు దానిని స్వీకరిస్తారని కేటిఆర్ అభిప్రాయపడ్డారు.