
‘భరత్ అనే నేను’ సినిమాపై ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ‘ఈనాడు’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ చెప్పిన విషయాలు.
భరత్ అనే నేను సినిమా నేపధ్యంలో విద్యా, వైద్య రంగాలపై కూడా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు కేటిఆర్ సమాధానం చెపుతూ, “నిజానికి ప్రభుత్వ విధానపరమైన లోపాల కారణంగానే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వెనుకబడిపోయాయి. ఉదాహరణకు పేదవారికి మేలు చేసేందుకు ప్రవేశపెట్టబడిన ఆరోగ్యశ్రీ, ఫీజ్-రీఇంబర్స్ మెంట్ పధకాలు వారికి మేలు చేస్తున్నప్పటికీ, అంతకంటే ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలకు, కార్పోరేట్ ఆసుపత్రులకే లబ్ది కలిగించాయి. అదే సొమ్ముతో మనం ప్రభుత్వఆసుపత్రులను, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవచ్చు. అప్పుడవి కార్పోరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా నిలబడి పోటీపడి ఉండేవి.
మా ప్రభుత్వం ఇటువంటి లోపాలను గుర్తించి వాటిని సవరించే ప్రయత్నాలు చేస్తోంది. కానీ సినిమాలో చేసినట్లుగా రాత్రికి రాత్రే మార్పు సాధ్యం కాదు. మేము చేపట్టిన అనేక చర్యల వలన ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలతో పోటీ పడగలుగుతున్నాయి.
ఇక సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు సమాజంలో అనేక సమస్యలను పరిష్కరించడంపై జరిగిన చర్చలో, కేటిఆర్ మాట్లాడుతూ, “ఒక ప్రభుత్వాన్ని లేదా ఒక ముఖ్యమంత్రిని మార్చితే ఏ సమస్యా పరిష్కారం కాదు. ఇవాళ్ళ భరత్ రేపు మరొకరు ముఖ్యమంత్రి కావచ్చు. ఒక ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు, లేదా తీసుకొన్న ప్రజాహిత నిర్ణయాలు ఎప్పటికీ అమలవ్వాలంటే, వాటిని వ్యవస్తీకరించాలి. అంటే వాటి కోసం చట్టాలు చేయడం, వాటి అమలుకు శాస్వితమైన, పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం అవసరం. అప్పుడే ఎవరు అధికారంలో ఉన్నా ఆ మంచి కార్యక్రమాలు యాంత్రికంగా సాగిపోతుంటాయి. ఉదాహరణకు ఒకప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలని వచ్చేవారు నెలలు, సం.లు అధికారులు, కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరుగవలసి వచ్చేది. కానీ మేము ‘టి-పాస్’ విధానం ఏర్పాటు చేసిన తరువాత 15 రోజులలోనే అన్ని రకాల అనుమతులు లభిస్తున్నాయి. ఒకవేళ 15 రోజులలో అధికారులు దరఖాస్తుకు జవాబు ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా అనుమతి మంజూరు చేసినట్లుగా చట్టంలో నిబంధన విధించాము. ఇలాగ ప్రతీది వ్యవస్థీకృతం చేయడం వలన భవిష్యత్ లో ఎవరు అధికారంలో ఉన్నా ఈ వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోతుంటాయని కేటిఆర్ అన్నారు.