
ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ కు భోపాల్ కోర్టు ఈ మెయిల్ ద్వారా నోటీస్ జారీ చేసింది. అయితే ఇది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాల లీకేజీకి సంబంధించిన కేసు కాదు. భోపాల్ లోని ‘ద ట్రేడ్ బుక్.ఆర్గ్’ అనే స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకుడు స్వప్నిల్ రాయ్ పిర్యాదు మేరకు జుకర్ బర్గ్ కు భోపాల్ కోర్టు నోటీసు పంపింది.
సాధారణంగా అనేక సంస్థలు ఫేస్ బుక్ లో ఖాతాలు తెరిచి, తమ వ్యాపారాలను ప్రమోట్ చేయడానికి ఫేస్ బుక్ సంస్థకు కొంత సొమ్ము చెల్లిస్తుంటాయి. స్వప్నిల్ రాయ్ కూడా తన ‘ద ట్రేడ్ బుక్.ఆర్గ్’ పేరిట ఫేస్ బుక్ లో ఖాతా తెరిచి, తన సంస్థకు ప్రచారం చేయడానికి ఫేస్ బుక్ సంస్థకు కొంత సొమ్ము చెల్లించాడు. ఫేస్ బుక్ సంస్థ ఆ డబ్బు తీసుకొని మూడు రోజులు ప్రచారం చేసిన తరువాత దానిని నిలిపివేయడమే కాకుండా, ఫేస్ బుక్ పేరులాగే ఉన్న ‘ద ‘ట్రేడ్ బుక్.ఆర్గ్’లో బుక్ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ స్వప్నిల్ రాయ్ కు లీగల్ నోటీస్ పంపించింది.
తనది బిజినెస్ నెట్ వర్క్ ప్లాట్ ఫారం అని ఫేస్ బుక్ చేస్తున్న వ్యాపారాలకు, తన సంస్థ వ్యాపారాలకు ఎక్కడా పోలిక, సంబందాలే లేవని, కానీ తన దగ్గర డబ్బు తీసుకొని తనకు మందుగా తెలియజేయకుండా ప్రచారం నిలిపివేయడం, సంస్థ పేరులో ‘బుక్’ అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనకు లీగల్ నోటీస్ పంపించడం వలన తాను తీవ్ర మానసిక ఒత్తిడికి, వ్యధకు లోనయ్యాయని, కనుక తనకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ స్వప్నిల్ రాయ్ భోపాల్ కోర్టును ఆశ్రయించారు. అయన పిర్యాదు మేరకు భోపాల్ కోర్టు ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ కు ఈ మెయిల్ ద్వారా నోటీస్ జారీ చేసి దీనిపై కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది.
ఇప్పటికే డాటా లీకేజి వ్యవహారంలో ఫేస్ బుక్ సంస్థ, దాని సీఈఓ జుకర్ బర్గ్ తీవ్ర అప్రదిష్టపాలయ్యారు. భారత ప్రభుత్వం కూడా ఆ సంస్థను దీనిపై వివరణ కోరింది. ఇప్పుడు ఇటువంటి చిన్న చిన్న సంస్థలు కూడా ఫేస్ బుక్ సంస్థపై కేసులు వేస్తే ఇంకా అప్రదిష్టపాలయ్యే ప్రమాదం ఉంది. అయినా ఫేస్ బుక్ లో బుక్ ఉంది కనుక ఇక ప్రపంచం ఎవరూ ‘బుక్’ అనే పదాన్ని వాడుకోకూడదని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా!