
గత నవంబర్ 29 నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభించినప్పుడు, కొత్తలో రోజుకు సుమారు లక్షమంది వరకు ప్రయాణించేవారు. కానీ అందరికీ తెలిసిన కారణాల వలన ఆ సంఖ్య 60,000కు పడిపోయింది. మంత్రి కేటిఆర్ సూచనల మేరకు ప్రతీ 7-8 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్ళను నడిపిస్తుండటంతో ఇప్పుడు మెట్రోలో రోజూ ప్రయాణిస్తున్నవారి సంఖ్య 65-75,000కు పెరిగింది. రాజధానిలో వేసవి ఎండలు విపరీతంగా పెరగడం, ఐపిఎల్ మ్యాచ్ లు ఉన్న రోజున అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు నడిపిస్తుండటం కూడా ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మియాపూర్-అమీర్ పేట-నాగోల్ రెండు కారిడార్లలో కలిపి రోజుకు 520 సర్వీసులు నడిపిస్తోంది. కనుక ప్రయాణికులు ప్లాట్ ఫారం మీదకు చేరుకొన్న ఐదారు నిమిషాలలోనే రైలు ఎక్కి ప్రయాణించగలుగుతున్నారు. ఎల్బి నగర్, హైటెక్ సిటీ కారిడార్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.