దేశానికి మనమే నీళ్ళు తాపిద్దాం: కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆదివారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన జిల్లాలు, సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకొని అధికారులకు అనేక సూచనలు చేశారు. 

మెయిన్ గ్రిడ్ పనులలో ఇన్-టెక్ వెల్స్, పంపు హౌసులు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, ప్రధాన పైప్ లైన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి కనుక ఆగస్ట్ లోగా మిగిలిన పనులు కూడా పూర్తిచేసి ఏవైనా సమస్యలు, లోపాలున్నట్లయితే వాటిని సరి చేసి డిసెంబర్ నాటికల్లా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు తప్పనిసరిగా నీళ్ళు అందించాలని కోరారు. అన్ని ఇళ్ళకు నీళ్ళు అందించలేకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగబోమనే తన సవాలుకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. కనుక సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు అందరూ మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తిచేయాలని కోరారు. 

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాలకు మంచినీళ్ళు సరఫరా చేయడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, , మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు కలిసి సమన్వయంతో పనిచేసి ఆయా జిల్లాలలో మారుమూల గ్రామాలకు, ఏజన్సీ ప్రాంతాలకు మిషన్ భగీరథ పధకం ద్వారా మంచినీళ్ళు అందించడానికి అవసరమైన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. 

తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ భగీరథ పధకాన్ని కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో పలురాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని, దీనిని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలలో కూడా అమలుచేయడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. యావత్ దేశానికి నీళ్ళు తాపించే పధకాలకు మిషన్ భగీరథ ఆదర్శంగా నిలుస్తుందని, ఇది గుర్తించి అందరూ ఈ పధకాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.