కర్ణాటక ఎన్నికల ప్రచారానికి చిరంజీవి, నగ్మా

కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 12న జరుగబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా నెలరోజులే గడువు ఉన్నందున అన్ని పార్టీలు ప్రచారం మరింత ఉదృతం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈసారి భాజపా, జెడిఎస్ ల నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నందున పార్టీలోని సినీ తారలను రంగంలో దింపడానికి సిద్దమైంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డి.శివకుమార్ శనివారం ఒక జాబితాను విడుదల చేశారు. దానిలో చిరంజీవి, నగ్మా, ఖుష్బూ, రాజ్ బబ్బర్ తదితర నటీనటుల పేర్లున్నాయి. వారందరూ త్వరలోనే కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

చిరంజీవి, నగ్మా, ఖుష్భూ కర్ణాటకలో తెలుగువారికే కాకుండా కన్నడ ప్రజలకు కూడా చిరపరిచితులు కనుక వారి ప్రచారంతో ప్రజలను ఆకట్టుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతోంది. ఈరోజు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో యూపి మాజీ ముఖ్యమంత్రిఅఖిలేష్ యాదవ్, ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్, అయన కుమారుడు తేజస్వీ యాదవ్ పేర్లు కూడా ఉండటం విశేషం. వారు కాక మాజీ క్రికెటర్స్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రేణుకా చౌదరీ, ఉమన్ చాందీ, గులాం నబీ ఆజాద్, సుషీల్ కుమార్ షిండే, శశి ధరూర్, సచిన్ పైలట్, అశోక్ చవాన్, జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్ వంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. 

చిరంజీవి రాజాకీయాల నుంచి మళ్ళీ సినీరంగంలో ప్రవేశించిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించినందున 2019 ఎన్నికలలో ఏపి నుంచి పోటీ చేస్తారో లేదో చూడాలి.