ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం చెన్నైలో డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించడానికి వచ్చినప్పుడు అయన రాకను నిరసిస్తూ కొందరు ఆందోళనకారులు నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారినందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో వారిలో ధర్మలింగం అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే మంటలు ఆర్పి అతనిని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీంతో చెన్నై అంతటా మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తమిళనాడులో రాజకీయ పార్టీలు కావేరీబోర్డ్ ఏర్పాటు చేయాలనికోరుతూ ఉద్యమిస్తున్నాయి. అన్నాడిఎంకె ఎంపిలు పార్లమెంటులో అందోళనలు చేసినప్పటికీ మోడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో తమిళనాట పార్టీలు కేంద్రప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నాయి.
పార్లమెంటులో అన్నాడిఎంకె తదితర ఎంపిల తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు, భాజపా ఎంపిలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో భాజపా నేతలు గురువారం నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తూనే ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై రావడంతో వారికి పుండు మీద కారం చల్లినట్లయ్యి భగ్గుమంటున్నారు.
కానీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రిపన్నీర్ సెల్వం, అన్నాడిఎంకె నేతలు చెన్నై విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్ ప్రకారం అది తప్పనిసరి కనుక వారు ప్రధానమంత్రికి స్వాగతం పలికి ఉండవచ్చు. కానీ అన్నాడిఎంకె-కేంద్రప్రభుత్వం మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే అన్నాడిఎంకె నేతలు ప్రధానికి స్వాగతం చెప్పేందుకు బారులు తీరారని ప్రతిపక్షాలు విమర్శించడం ఖాయం.