మెట్రో కబుర్లు

మియాపూర్ నుంచి నాగోల్ వరకు పరుగులు తీస్తున్న మెట్రో రైళ్ళు అతి త్వరలోనే ఎల్.బి.నగర్ వైపు కూడా పరుగిడనున్నాయి. బుధవారం నుంచి ఆ మార్గంలో మెట్రో ట్రయల్ రన్స్ మొదలయ్యాయి. జూన్ నాటికి ఆ మార్గం లో కూడా మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు పట్టుదలగా కృషి చేస్తున్నారు. అమీర్ పేట నుంచి ఎల్.బి.నగర్ కు 16 కి.మీ. దూరం ఉంది. ఒక్కో కిలో మీటరుకు ఒకటి చొప్పున మొత్తం 16 మెట్రో స్టేషన్లు నిర్మించారు. వాటి లోపల నిర్మాణపనులు చురుకుగా జరుగుతున్నాయి.

అమీర్ పేట తరువాత పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఎంజిబిఎస్, చాదర్ ఘాట్, మలక్ పెట్ మార్కెట్, మూసారంబాగ్, దిల్ షుఖ్ నగర్, చైతన్యపూరి, విక్టోరియా మెమోరియల్, ఎల్.బి.నగర్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్లు నిర్మించారు. అమీర్ పేట వద్ద ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ మాదిరిగానే ఎం.జి.బి.ఎస్. వద్ద కూడా మూసీ నదిపై ఒక బారీ ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ నిర్మించారు. దీనితో కారిడార్-1,2 అనుసంధానం అవుతాయి.  

ఈ కారిడార్ లో పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారం బాగ్-మలక్ పేట టీవి టవర్ మెట్రో స్టేషన్లలో బారీ మెట్రో షాపింగ్ మాల్స్ ను కూడా నిర్మిస్తున్నారు.            

అమీర్ పేట నుంచి ఎల్.బి.నగర్ స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యూదీకరణ, టెలీకమ్యూనికేషన్ పనులు పూర్తవడంతో నిన్నటి నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభించారు. ఇక నుంచి ఈ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యేవరకు ప్రతీరోజు ట్రయల్ రన్స్ నిర్వహించాలని ఎల్&టి సంస్థ అధికారులు నిర్ణయించారు.  

మరోపక్క అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో నిర్మాణపనులు చాలా చురుకుగా సాగుతున్నాయి. ఈ కారిడార్ ఆగస్ట్ నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.