ప్రపంచపు ఏడు వింతలలో నేటికీ ఒకటిగా నిలుస్తోంది ఆగ్రాలోని తాజ్ మహల్. దానిని సందర్శించడానికి వస్తున్న పర్యాటకుల నుంచి ముక్కు పిండి డబ్బు వసూలుచేస్తున్న దాని నిర్వాహకులు, దాని సంరక్షణపై శ్రద్ధ చూపడంలేదనే చెప్పాలి. తాజ్ మహల్ దక్షిణ ప్రవేశద్వారం వైపున్న ఒక స్థంభం కూలిపోయింది. గత రెండు రోజులుగా ఆగ్రాతో సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో బారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాటి దెబ్బకు బుధవారం రాత్రి ఒక స్థంభం కూలిపోయింది.
భారతదేశానికి ఒక ఐకాన్ గా నిలుస్తున్న అటువంటి అద్భుతమైన కట్టడాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసి ఉంది. కానీ బలహీనపడిన ఆ స్తంభాన్ని సకాలంలో గుర్తించి దానికి అవసరమైన మరమత్తులు చేయడంలో తాజ్ మహల్ నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించిన కారణంగానే అది కూలిపోయిందని చెప్పకతప్పదు. కానీ తాజ్ మహల్ కు నాలుగు వైపులా ఉన్న ప్రధాన స్థంభాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉండటమే కాస్త ఉపశమనం కలిగించే విషయం. అటువంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించలేనప్పుడు కనీసం ఉన్నవాటినైనా జాగ్రత్తగా కాపాడుకొంటే చాలు.