“ముఖ్యమంత్రి కెసిఆర్ మొదలు మంత్రులు అందరూ వచ్చే ఎన్నికలలో తెరాసకు 100 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని నమ్మకంగా చెపుతున్నప్పుడు కొత్తగా ఏర్పాటవుతున్న మా టిజెఎస్ ను చూసి భయపడటం దేనికి? మేము హైదరాబాద్ లో మా పార్టీ ఆవిర్భావసభ జరుపుకొంటామంటే తెరాస సర్కార్ ఎందుకు అభ్యంతరం చెపుతోంది? అధికారంలో ఉన్నవారు చట్టబద్ధంగా పాలన చేయాలి తప్ప ఇటువంటి నిరంకుశపోకడలు ప్రదర్శించడం సరికాదు. మేము ప్రభుత్వ విధానాలను, లోపాలను ఎత్తి చూపి నిలదీస్తామనే భయంతోనే మా సభకు అనుమతించడంలేదని భావిస్తున్నాము. రాజకీయపార్టీలు సభలు సమావేశాలు నిర్వహించుకోవడం, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని కాదనే హక్కు ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యం కేవలం మాటలలోనే కాదు...ఆచరణలో కూడా పాటించాలి. ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలకు, పోకడలకు స్థానం లేదు..ఉండదు. నిరంకుశత్వపాలనను ప్రజలు కూడా నిరసించాలి. అప్పుడే పాలకులు కూడా గాడి తప్పకుండా ఉంటారు,” అని కోదండరాం అన్నారు.