తెలంగాణా కోసం మోడీతో పోరాడుతా: బాబా రాందేవ్

నిజామాబాద్ పట్టణంలో మూడు రోజులు యోగాభ్యాసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన యోగాగురు బాబా రాందేవ్ తెరాస ఎంపి కవిత, మంత్రి హరీష్ రావు తదితరులను కలిసినప్పుడు, జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కవిత చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపారు. మరొక ఏడాదిలోగానే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక, పసుపు బోర్డు ఇప్పుడే గట్టిగా పోరాడితే సాధించుకోవచ్చునని, అందుకు తాను మద్దతు ఇస్తానని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో తమ సంస్థ దేశంలో రెండవ స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం మౌలికవసతులు కల్పించి భూమిని కేటాయించగానే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడతామని బాబా రాందేవ్ చెప్పారు. 

భాజపా, ఆర్.ఎస్.ఎస్.లతో మంచి బలమైన సంబంధాలున్న బాబా రాందేవ్ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు పలకడం చాలా మంచి పరిణామంగానే భావించవచ్చు. అయన కూడా దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకావచ్చు. ఇక జిల్లాలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కూడా ఏర్పాటయితే, నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు అన్నిటికీ మేలు కలుగవచ్చు.