మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు ‘సద్దిమూట’

రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డులకు వచ్చినప్పుడు ఒక్కోసారి ఐదారు రోజుల వరకు అక్కడే ఉండిపోవలసిన పరిస్థితులుంటాయి. అప్పుడు వారు యార్డులో కుప్పలు పోసిన తమ ఉత్పత్తులను వదిలి ఇళ్ళకు వెళ్ళలేక అక్కడే ఉండలేక నానాబాధలు పడుతుంటారు. ఆ సమయంలో వసతి, ఆహారం, కనీసం త్రాగడానికి మంచి నీళ్ళు లభించక బాధపడుతుంటారు. వారి సమస్యలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్ యార్డులలో వారికి అన్ని సౌకర్యాలు ఉండేవిధంగా నిర్మిస్తోంది. తాజాగా వారికోసం సాగునీటిశాఖా మంత్రి హరీష్ రావు ‘సద్దిమూట’ అనే కొత్త పధకాన్ని మంగళవారం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులకు వచ్చే రైతన్నలకు, అక్కడే పనిచేసే వ్యవసాయ కూలీలకు, లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లకు కేవలం రూ.5లకే భోజనం అందించే పధకం సద్దిమూట. దీనికోసం అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. త్వరలోనే న్ని జిల్లాలలో రైతులకు ఈ సద్దిమూటలు అందుతాయి. 

రాష్ట్ర బడ్జెట్ లో 40 శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించే ఏకైక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తోందని చెప్పారు. ఈనెల 19వ తేదీ నుంచి రైతుబందు పధకం క్రింద రాష్ట్రంలో ఒక్కో రైతుకు ఎకరాకు రూ.4,000 చొప్పున పంటపెట్టుబడిని అందించబోతున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.