పంటపెట్టుబడికి నిధులు రెడీ!

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పంటపెట్టుబడి పధకాని(రైతుబందు)కి అవసరమైన నిధులు సిద్దం అయ్యాయి. దీని కోసం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.7,800 కోట్లు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా మొదటి వాయిదాలో రూ.2,000 కోట్లు మంజూరు చేసింది. మరొక వారం రోజులలో మరో రూ.2,000 కోట్లు రుణం విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 

రైతుబంధు పధకం క్రింద ఈనెల 20వ తేదీ నుంచి రైతులకు చెక్కులు పంపిణీ మొదలుపెట్టి మార్చి15లోగా ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడత చెక్కుల పంపిణీకి నగదు సిద్దం అయ్యింది. ఈ పధకంలో మొదటిపంటకు సుమారు రూ.5,800 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు లెక్క కట్టారు. కనుక గడువులోగా మిగిలిన మొత్తాన్ని కూడా సమకూర్చుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. 

తెలంగాణాతో సహా మొత్తం 13 రాష్ట్రాలు ‘రాష్ట్రాభివృద్ధి’ కోసమని ఈ రుణాలు తీసుకొన్నాయి. కనుక ఈ రుణాన్ని అభివృద్ధి పనులపై ఖర్చు పెట్టవలసి ఉంది కానీ తెలంగాణా ప్రభుత్వం సంక్షేమ పధకంపై ఖర్చు చేయబోతోంది. దీనిపై రాష్ట్ర ఆర్ధికశాఖ అధికారి ఒకరు వివరణ ఇస్తూ, “ఈ రుణానికి రైతుబందు పధకానికి ఎటువంటి సంబంధమూ లేదు. దీనిని అభివృద్ధి పనులకే కేటాయిస్తాము. అయితే వివిధ ప్రభుత్వశాఖల మద్య తాత్కాలికంగా నగదు సర్దుబాట్లు జరుగుతుంటాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ నుంచి అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం, వాటిని తిరిగి చెల్లిస్తుండటం ఒక సర్వసాధారణమైన నిరంతర ప్రక్రియ కనుక దీనిని తప్పుగా భావించరాదు,” అని అన్నారు.