తెలంగాణా రాష్ట్రంలో 8 స్థానిక సంస్థలకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయితీ అవార్డులు లభించాయి. ఏప్రిల్ 24న జాతీయ పంచాయితీ దివస్ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.
రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ (ఆదిలాబాద్), రెండు మండల పరిషత్ (సిద్ధిపేట, శ్రీరాంపూర్), నాలుగు గ్రామ పంచాయితీలు( రాజన్న సిరిసిల్ల మండలంలోని ముష్టిపల్లి, సిద్ధిపేట మండలంలోని ఇర్కోడు, రంగారెడ్డి జిల్లా, ఫారూఖ్ నగర్ మండలంలోని గంటల్ పల్లి, కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల) దీనదయాళ్ ఉపాద్యాయ్ పంచాయితీ సశక్తికరణ్ అవార్డులకు ఎంపికైనట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇవేకాక కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామం నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారానికి ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ అవార్డులు పొందిన పంచాయితీలకు జనాభా ప్రాతిపదికన రూ.8-12 లక్షలు, మండల పరిషత్ లకు రూ.25 లక్షలు, జిల్లా పరిషత్ కు రూ.50 లక్షలు, గ్రామసభ పురస్కారానికి రూ. 10 లక్షలు నగదు పురస్కారాలు కేంద్రం అందిస్తుంది. ఏప్రిల్ 24న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.