సిపిఎం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్)లో తెలంగాణా జనసమితి (టిజెఎస్) కూడా చేరాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం ప్రొఫెసర్ కోదండరాంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, భాజపా, తెరాసలను ఓడించాలంటే బిఎల్ఎఫ్ తో చేతులు కలపాలని కోరారు.
కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనపై తమ్మినేని స్పందిస్తూ, గతంలో తాము కూడా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నించామని కానీ దానిలో భాగస్వాములుగా చేరిన ప్రాంతీయపార్టీలు తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందున తమ ప్రయత్నం విఫలమైందన్నారు. ఇప్పుడు కెసిఆర్ స్పష్టమైన అవగాహన లేకుండా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెపుతున్నారని అన్నారు. స్పష్టత లేని అటువంటి ఫ్రంట్ తో తాము చేతులు కలపాలనుకోవడంలేదని తమ్మినేని అన్నారు.
రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించకుండా నిరంకుశపాలన సాగిస్తున్న కెసిఆర్ జాతీయస్థాయిలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వ వైఖరిని, విధానాలను ప్రొఫెసర్ కోదండరాం వ్యతిరేకిస్తున్నారు కనుక అయన బిఎల్ఎఫ్ లో భాగస్వామిగా చేరాలని విజ్ఞప్తి చేశారు. ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని విలేఖరులకు తెలిపారు. బిఎల్ఎఫ్ లో గద్దర్, విమలక్క ఇంకా అనేకమంది ప్రముఖులు చేరేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని తమ్మినేని చెప్పారు.
ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీతో రహస్య సంబంధం ఉందని తెరాస ఆరోపిస్తోంది. అది నిజం కాదని ఆయన నిరూపించుకోదలిస్తే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న బిఎల్ఎఫ్ లో చేరవచ్చు. బిఎల్ఎఫ్, టిజెఎస్ రెంటి లక్ష్యాలు ఒకటే. పైగా బిఎల్ఎఫ్ లో ఉన్నవారిలో చాలా మంది కోదండరాం స్నేహితులే. అయినప్పటికీ దానితో చేతులు కలిపేందుకు ప్రొఫెసర్ కోదండరాం ఎందుకో వెనుకాడుతున్నారు. వచ్చే ఎన్నికలలో టిజెఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని కోదండరాం చెపుతున్నారు. అంటే తెరాస ఆరోపణలు నిజమనుకోవాలా?
కానీ కాంగ్రెస్ వాదన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టిజెఎస్ బరిలో దిగితే తెరాస వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెరాసకు లబ్ది కలుగుతుందని, కనుక కోదండరాం తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఇంకా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించక మునుపే కోదండరాంకు గొప్ప ధర్మసంకటమే వచ్చింది. అయన కాంగ్రెస్, బిఎల్ఎఫ్ లలో దేనితో చేతులు కలుపుతారో చూడాలి.