ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గంలో సోమవారం ఒక అధికారిక కార్యక్రమం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడైన మల్లు భట్టి విక్రమార్కను అధికారులు ఆహ్వానించారు. అయితే అయన రాక మునుపే మంత్రి కేటిఆర్ శిలాఫలకం ఆవిష్కరించి వెళ్ళిపోయారు. ఈ సంగతి తెలుసుకొన్న మల్లు భట్టి విక్రమార్క తన అనుచరులతో కలిసి నిరసన తెలియజేయడానికి అంబేద్కర్ సెంటర్ కు ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు దారిలోనే అడ్డుకొన్నారు. కాసేపు వాదోపవాదాలు జరిగిన తరువాత చివరికి పోలీసులు వారిని అనుమతించారు.
మల్లు భట్టి విక్రమార్క అనుచరులు సభా స్థలికి చేరుకొని కాసేపు ధర్నా చేశారు. తరువాత మధిర కాంగ్రెస్ కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ, “కేటిఆర్ అధికారమధంతో వ్యవహరిస్తున్నాడు. మంత్రిననే అహంకారంతో ప్రోటోకాల్ పాటించకుండా నేను రాకమునుపే శిలాఫలకం ఆవిష్కరించి వెళ్ళిపోయాడు. రాజకీయాలలో పిల్లకాకి కేటిఆర్. నాకు ఎదురుపడలేక భయంతో నేను రాక మునుపే పారిపోయాడు. మంత్రి అయ్యుండి ప్రోటోకాల్ ఉల్లంఘించడం సిగ్గుచేటు. దీనికి కేటిఆర్ తుమ్మల నాగేశ్వర్ రావు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఖమ్మం నుంచి 60 కిమీ దూరంలో ఉన్న మదిరకు రోడ్డుమార్గంలో వచ్చే అవకాశమున్నా ఏదో విహారయాత్రకు వస్తున్నట్లు కేటిఆర్ హెలికాఫ్టర్ లో వచ్చాడు. తెరాస నేతలు, మంత్రులు ఈవిధంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాకు ఏమీ చేయలేదని పదేపదే విమర్శిస్తున్న కేటిఆర్ మరి తన తండ్రి, కుటుంబ సభ్యులందరితో కలిసి సోనియా గాంధీ కాళ్ళ మీద ఎందుకు పడ్డారో చెప్పాలి,” అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.